నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన “సమాధి స్థితి”గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.
చక్రాలు :
మానవ శరీరంలోని చక్రాల వివరణ:
వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే నాలుగు రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు వేల జపములు జరుగును. మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై గుహ్యమందున నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగును. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడంగులములలో నాభి నందున ఒక అగ్ని నిలయమై మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
నాలుగవది అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.
విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన పన్నెండు అంగులములలో కంఠం నందున వుంటుంది. పదహారు దళములుంటాయి. రెండు ఘడియల నలభై అయిదు విఘడియలకు వేయి హంస జపములు జరుగుతుంది. అధినాయకుడు జీవుడు.
ఆజ్ఞేయ చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి హంస జపములు జరుగును. దీనికి సర్వేశ్వరుడు అధిష్టాన దేవత.
సహస్రారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, నడి నెత్తిన బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది. ఓంకారము ధ్వనించుచుండును. రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును. గురుమూర్తి అధిష్టాన దేవత.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది”
ఏకాగ్రతతో మనసు నిలిపివింటే ఓంకారము వినిపిస్తుంది. అదే విధముగా భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపితే పరంజ్యోతి కనిపిస్తుంది. ఆ చిదానంద మూర్తిని దర్శించితే ముక్తి ప్రాప్తిస్తుంది.పైన తెలిపిన చక్రాలు ముఖ్యమైనవి ఇవికాక శరీరమంతా విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి’చక్ర’లు. అరచేతి వేళ్ల చివర్లలో సైతం చక్రాలు వుంటాయి. అరచేతిలో రెండు చక్రాలుంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు వుంటాయి.
బహిర్గతంగా వుండే చెడుశక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేసేందుకు ఈ చక్రాలే కారణం. ఇవి బలహీనపడితే వ్యాధులు ప్రబలుతాయి. ఏ భాగంలో వుండే చక్ర బలహీనపడితే అక్కడ 6వుండే శరీరభాగం దెబ్బతింటుంది. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా కేవలం రెండు లేక మూడు చక్రాలు మాత్రమే బాగా క్రియాశీలకంగా వుంటాయి. మిగిలినవి సాధారణస్థితిలో వుంటాయి. ఏయే చక్రాలు చురుకుగా వుంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పని చేసి కొన్ని రంగాలలో బాగా రాణిస్తారు.
శరీరంలో వుండే ఏడు ప్రధాన చక్రాలలో మొట్టమొదటిది మూలస్థానంలో వుంటుంది. మొత్తం ఈ ఏడు చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపటం ద్వారా జీవశక్తిని అందిస్తాయి. ఈ ఏడు చక్రాలలో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు.
కాలివేళ్ళు, చేతివేళ్ళలో ఏడు చిన్న చక్రాలున్నాయి. ఏడు చక్రాలు శక్తిమయ దేహంలోవున్న ఏడు పొరలతో అనుసంధానం కలిగివుంటాయి. విశ్వంలోని విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధానచక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈసప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించివున్న విశ్వశక్తిని గ్రహించి భౌతిక శరీరానికి అందించటం ద్వారా శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి.
చక్రాలు మూలస్థానం నుంచి చివరివరకు చూస్తే ఒక శంఖు ఆకారాన్ని పోలి వుంటాయి. చక్రం చివరి భాగం శరీరం బైటకు వుండి శక్తి మయ శరీరంలోని ఏదో ఒక అంశతో అనుసంధానాన్ని కలిగివుంటుంది.
శరీరంలోని నేత్రాలు, మెదడు, హృదయం, జీర్ణవ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, జననాంగ వ్యవస్థలతో చక్రాలు సంబంధాన్ని కలిగివుంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించేందుకు ఇవి అత్యంత ఆవశ్యకాలు. ఏయే చక్రాలు అత్యంత క్రియాశీలంగా వున్నాయో తెలుసుకోవటం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు.
వ్యక్తిత్వ లక్షణాలను, ప్రవర్తనా తీరును నిర్దేశించేవి ఆయా భాగాలకు అనుసంధానం చేయబడిన చక్రాలు. ఏదైనా ‘చక్ర’ బలహీనపడినట్టైతే సంబంధిత శరీరభాగం కూడా బాగా దెబ్బతింటుంది.
ఇది బాగా క్షీణ దశకు చేరుకున్న సమయంలో వ్యాధి రూపంలో భౌతిక శరీరంలో బహిర్గతమవుతుంది. నిజానికి వ్యాధి మూలం భౌతిక శరీరంలో వుండదు. సంబంధిత ‘చక్ర’కు విశ్వశక్తిని అందించటం ద్వారా రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. ఫలితంగా భౌతిక శరీరం వ్యాధిని నిర్మూలించటమే కాకుండా చురుకుగా పనిచేస్తుంది.
వెన్నెముక లో ఉండే చక్రాలు:
సప్తచక్రాలు షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.
మూలాధార చక్రము :
గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
స్వాధిష్ఠాన చక్రము :
లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం.
ఇది. పొట్ట, కటి భాగం, లైంగిక అవయవాలకు సంబంధించినది. భావోద్వేగాలకు, లైంగిక విషయాలకు సంబంధించినది. ఇది అనుభూతులు, కోరికలు స్పందనలు, కదలికల ద్వారా ఇతరులతో సంబంధం పెంచుకుంటుంది. ఇది కాంతినీ, అనుభూతుల్లో గాఢతనూ, లైంగిక సంతృప్తినీ, మార్పును స్వీకరించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. స్వాదిష్టాన చక్రం మేధోపరమైన స్వచ్ఛతను, జ్ఞాపకశక్తినీ, సక్రమమైన, స్వచ్ఛమైన ఆలోచనల్నీ కలిగిస్తుంది. భావోద్వేగాలతో మమేకమై, గొప్ప ఆనందానికి పాత్రమయ్యేలా చేస్తుంది.
వెన్నెముక మొదట్లోనే ఈ చక్రం ఉంటుంది. ఇది భూమికి అనుబంధమైనది. ఇది మన మనుగడ గురించిన స్పృహను కలిగిస్తుంది. పునాది లాంటిది. ఇది ఆరోగ్యాన్నీ, సంపన్నతను, బధ్రతను, చలాకీతనాన్నీ కలిగిస్తుంది. నిర్భయత్వాన్నీ, సురక్షిత భావాన్నీ, భౌతిక ఐక్య భావనను, స్వీయ రక్షణా శక్తినీ కలిగిస్తుంది.
మణిపూరక చక్రము :
నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.
దీన్ని శక్తి చక్ర అని కూడా పిలుస్తారు. ఇది మన అంతర్గత శక్తిని నడిపిస్తుంది. మన శరీర వ్యవస్థనూ, జీవక్రియల్ని సైతం నియంత్రిస్తుంది. ఇది శరీరానికి అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ప్రభావవంతంగా ఉండేలా, తక్షణమే స్పందించేలా చేస్తుంది. ఎవరి మీదా ఆధిపత్యం లేని నైజాన్ని పెంపొందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, శ్రమ, విశ్రాంతుల తోడ్పాటుతో శరీరంలోని ప్రాణశక్తిని నిలబెడుతుంది. అహాన్ని గుర్తించడంతో పాటు, స్వీయ విశ్లేషణకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది.
అనాహత చక్రము :
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
ఈ చక్రాన్ని హృదయ చక్రం అని కూడా పిలుస్తారు. ఇది ఏడు చక్రాలకు మధ్యన ఉంటుంది. ఇది ప్రేమ సంబంధితమైనది. ఇది శరీరానికీ -మనసుకూ, పురుషుడికీ- సీ్త్రకీ , అస్తిత్వానికీ- నీడకు, అహానికీ-ఏకత్వానికీ మధ్యనుండే వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. ఇది గాఢమైన ప్రేమానుభూతికీ, అంకిత భావాన్నీ, లోతైన ఒక ప్రశాంత స్పృహనూ, అందులో మమేకమయ్యే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్నీ, ఽధైర్యాన్నీ నింపుతుంది. విషయాల్ని సహజంగా, యధాతథంగా స్వీకరించే మానసిక దిటవునూ పెంచుతుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమాజంలో మమేకమయ్యే శక్తిని కూడా కలిగిస్తుంది.
విశుద్ధి చక్రము :
కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.
ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఇది భావ వ్యక్తీకరణ, సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించినది. ఇక్కడ ప్రపంచాన్ని ప్రతీకాత్మకంగా, అంటే శబ్ద, భాష ప్రకంపాల ద్వారా తెలుసుకోగలుగుతాం. సృజనాత్మక ఐక్య భావనను, స్వీయ వ్యక్తీకరణ శక్తినీ ఇది పెంచుతుంది.
ఆజ్ఞా చక్రము :
భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.
ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండే మూడవ నేత్రం. దీన్ని భృకుటి చక్రంగానూ, మూడో చక్రంగానూ పరిగణిస్తారు. ఇది బాహ్యనేత్రంతోనూ, మనస్సాక్షి ఆధారంగానూ చూసే ప్రక్రియకు సంబంధించినది. ఇది మన మనో విజ్ఞాన అంశాల్ని, ఆర్కీటైపల్ స్థాయి అవగాహనా ద్వారాలు తెరిపిస్తుంది. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతాం. ఆజ్ఞచక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. విషయాల్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతాం.
సహస్రార చక్రము :
బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.
తలనుంచి కటి భాగందాకా వెళ్లే ఈ చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అనే బిందువును ప్రతిబింబిస్తుంది. అంతే కాదు స్వీయ జ్ఞానమయమైన ఒక దివ్యానందపు అనుభూతిని, ఒక మహోన్నతమైన ఆలోచనను, విఽశ్వైక్య భావనను కలిగిస్తుంది.
సప్తచక్రాలు-దేవతలు-వర్ణము(color)-మంత్రం-బీజాక్షరాలు:
శ్రీ విద్య లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రములుండును.
మూలాధార చక్రము :
పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి. మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ“ను వర్ణిస్తాయి.
నామములు :
మూలాధారామ్భుజారూఢ, పంచవక్తాృయ, ఆస్ధిసంసితాయ, అంకుశాది ప్రహరణాయ, వరదాది నిషేవితాయ, ముద్గౌదనాసక్తాయ. మూలాధారస్ధపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం, ధూమ్రాభా, మస్ది సంస్దాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాoతం ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ‘ నివసిస్తుంది.
ఈమెకు ఐదు ముఖములు:
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది.
వజ్రేస్వరి :
ఈ దేవతకి నాలుగు చేతులు.అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.
సాకిన్యాంబ వరదాది దేవతలు :
1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల ) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.
స్వాధిష్ఠాన చక్రము :
లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.
మణిపూరక చక్రము :
నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.
లాకిన్యంబాస్వరూపిణి :
6 నామాములు / 3 వ చక్రము . (495) నుండి (502) వరకూ నామములు :-
మణిపూరాబ్జనిలయ, వదనత్రయసంయుతా, వజ్రాధికాయుధోపేతాయ, డామర్యాదిభిరావృతాయ, రక్తవర్ణాయ, మాంసనిష్టాయ, గుడాన్నప్రీతాయ, సమస్తభక్త సుఖదాయ, దిక్పత్రే, నాభిపద్మే, త్రివదన విలస ద్దంష్ట్రిణీం, రక్తవర్ణాం, శక్తిం, దంభోళి, దండావ భయమపి, భుజైర్దారయంతీo , మహోగ్రాం, డామర్యాద్త్యై: , పరీతాం , పశుజన భయదాం, మాంసధాత్వేక నిష్టాం, గౌడన్నసక్త చిత్తాం, సకల సుఖకరీం, లాకినీమ్, భావయామి: నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు.
గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. మూడు ముఖములు కలది.గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. నాలుగు చేతులు కలది.వజ్రం, శక్తి, దండము, అభయ ముద్రలు ధరించింది. డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.
మణిపూరక చక్రం మంత్రం :
‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”
మణిపూరకచక్రం :
ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు. ‘గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి. బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం.
శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే– అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి. ఈ చక్ర మానసిక స్వభావం మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.
ఈ చక్రం తెరుచుకుంటే – లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే. లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.
మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం?
ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం “రం” ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ..) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి.
అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో- గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి. శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది. తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్ తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్ నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.
అనాహత చక్రము :
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.
రాకిన్యాంబస్వరూపిణి – (494) (9 నామములు) (4 వ చక్రము) అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు) హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్ చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది.
శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి. క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు “ద్వాదశ శక్తులు“.
అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టంకహస్తా 12. ఠంకారిణి
విశుద్ధి చక్రము :
కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.
డాకినేశ్వరి : (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. (475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.) ఆరక్తవర్ణాయ, త్రిలోచనాయ, ఖట్వాంగాది ప్రహరణాయ, వదనైకసమన్వితాయ, పాయసాన్నప్రియాయ, త్వక్ స్ధాయ, పశులోకభయంకరాయ, అమృతాధి , మహాశక్తిసంవృతాయ. (8 నామములు) గ్రీవాకూపే, విశుద్దే, నృపదళకమలే, శ్వేతరక్తాం,
త్రినేత్రాం హస్తే :
ఖట్వాంగ, ఖడ్గౌ, త్రిశిఖమపి, మహాచర్మ సంధారయంతీమ్ వక్త్రేణేకేనయుక్తాం, పశుజనభయదాం, పాయసాన్యైక సక్తాం త్వక్ద్సా వందేహమృతాద్యై: పరివృతవపుషాం, డాకినీo, వీరవంద్యామ్. డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు ఆన్నీ “డ” కార సంభంధమైనవి. డాకినీ వర్ణము ఎఱుపు.ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు. జీవి పిండ దశలో ‘శుక్త + రక్త ” సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన- భూత, భవిష్యత్, వర్తమానాలు చూడగలది. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములుగా గల దేవత.
బీజాక్షరములు : ఖ, ఛ, ఠ, ధ, ఫ — ఘ, ఝ, ఢ, ధ, భ.
హాకినీరూపధారిణి : 6 నామములు / 6 వ చక్రము… 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక. భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్ విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం, హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః
ఆజ్ఞా చక్రము :
భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.
హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము)
521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.
భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్
విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం
షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,
హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః
ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము.
బీజాక్షరములు :
‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.
సహస్రార చక్రము :
బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.
యాకిన్యంబస్వరూపిణి :
6 నామములు / 7 వ చక్రము … 528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. (సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)
ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్
రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం
ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం
సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః
శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది.యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల..వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది . ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది. ఇంతవరకు ‘స్మరణ’ యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు.
ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే ..భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.
సహస్రారచక్రం:
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ
ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం.
ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం.
పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. ఈ చక్ర మానసిక స్వభావం ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు . ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు.
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే :
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి.
ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం ‘సూర్యుడు’. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు.
సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి. ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి.
అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి.
(ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి).
ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది. ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. ‘నేను’ అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు ‘అహంబ్రహ్మస్మి’ అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి ‘అహం బ్రహ్మస్మి’ అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి.
అరిషడ్వర్గాలను జయించినప్పుడే… కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి, నాడీ శుద్ధి, మనో శుద్ధి మరియు బుద్ధి శుద్ధి ఎలా జరగాలో బోధిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం విసదీకరించారు. కర్మఅంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది.
అవన్నీ కర్మ ఫలాలే ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుంన్నది .
కర్మ ఫలం మీద అధికారం లేదు.. కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది. కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు.అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే.కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి! పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే.
కర్మ అంటే ఏమిటి?
నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు.పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు.
కర్మ పల్లే పాపపుణ్యాలు జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. అంటే. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం.
భగవంతుని ఆధీనంలో కర్మఫలం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి . భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని యోగ శాస్త్రం బోధిస్తుంది. మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది ఆద్యాత్మిక దృష్టితో యోగ శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని యోగ శాస్త్రాలు బోధిస్తుంది.
బీజాక్షర వివరణార్థములు:
వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి(Positive energy) క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును. బీజమంత్రములు అనేవి స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.
అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె. యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది.
ఓం:
‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓంకారము. ‘అ’ కారము ఋగ్వేదమునకు, ‘ఉ’ కారము సామవేదమునకు, మరియు ‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక. సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.
క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం :
ఇది కాళీమాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.
శ్రీం లేదా వం :
ఇది మహాలక్ష్మి బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్రపిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల భార్య లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.
హ్రౌం లేదా దూం లేదా రం:
ఇది శివ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ మణిపురచక్రములో చేయవలయును. మణిపురచక్రము అగ్ని తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆత్మనిగ్రహశక్తి వృద్ధి చెందును. అకాల మరణము, చక్కర (diabetes) వ్యాధినుండి రక్షణ, మోక్షమునకు మార్గము లభించుట ఆరోగ్యము, అంగములలో బలము, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల బార లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.
హ్రీం లేక ఐం లేక యం:
ఇది మహామాయ లేక భువనేశ్వరీ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ అనాహతచక్రములో చేయవలయును. అనాహతచక్రము వాయు తత్వమునకు ప్రతీక. తద్వారా బీజశక్తి(root power) వృద్ధి చెందును. తద్వారా ప్రాణశక్తి నియంత్రణ వృద్ధి చెందును. వాయుప్రకోపనముల (gastric disturbances) వ్యాధులనుండి రక్షణ, నాయక లక్షణములు కలుగుట ఏర్పడును.
గం లేక ఫ్రౌం లేక హమ్:
ఇది గణపతి, కుండలినీ, మరియు హనుమాన్ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ విశుద్ధ చక్రములో చేయవలయును. విశుద్ధ చక్రము ఆకాశ తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.
దం లేక ఓం:
ఇది విష్ణు బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ ఆజ్ఞా చక్రములో చేయవలయును. ఆజ్ఞా చక్రము కృష్ణ తత్వమునకు ప్రతీక. తద్వారా శుద్ధ జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.
క్ష్రౌం లేక రాం :
ఇది నరసింహ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ సహస్రార చక్రములో చేయవలయును. తద్వారా సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును మరియు సాధకుడు స్వయముగా సాక్షీభూతుడు అగుతాడు.
ప్రాణశక్తి కేంద్రీకరణ(ఆజ్ఞా చక్రం జ్ఞానానికి తాళం చెవి):
సులభతర కుండలీ యోగములో ఆజ్ఞాతపస్సు మొదటి మెట్టు.ఈ తపస్సులో భ్రూమధ్యంలోని ఆజ్ఞా చక్రంలో ప్రాణశక్తి మీద మనసు కేంద్రీకరించటం జరుగుతుంది.ఇంత వరకు మూలాధార చక్రము నుండి పనిచేస్తున్న ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రానికి తీసుకురావటం జరుగుతుంది. ఆజ్ఞా చక్రం సహస్రార చక్రానికి ఒక తాళం చెవి లాంటిది.మొదటిది ఆరోగ్య వంతంగా ఉంటే రెండవది అదుపులో ఉంచుకోవచ్చు.7 సంవత్సరాల వరకు పిల్లలు అమాయకత్వంతో ఉంటారు. ఆ తరువాత 7 – 8 సంవత్సరాల వయస్సు నుండి పీనియల్ గ్రంథి దోషపూరితమై వారి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయి.
అమాయకత్వం, దైవత్వం పోయి మనసు కలుషితమవుతుంది.అందుకే పూర్వం రోజులలో ఆ వయసులోనే పిల్లలకి “ఉపనయనం” చేసేవారు. సంధ్యా వందనం, గాయత్రీ పఠనం చెయ్యడం వలన మంచి నడవడిక అలవడేది. ఇప్పుడు ఈ కాలంలో పీనియల గ్రంథి లోపాలను సవరించడానికి త్రాటకం, శాంభవీ ముద్ర చెయ్యాలి. ఆజ్ఞా చక్రం 2 దళాలు కలిగిన పద్మం.ఇది నీలి బూడిద రంగులో ఉంటుంది. దీని యొక్క రెండు దళాలలో ఒక దళం పైన “హం” అని రెండవ దళం పైన “క్షం” అనే అక్షరాలు ఉంటాయి. ఇవి శివ , శక్తులకు సంబంధించిన దళ బీజమంత్రాలు. ఈ చక్ర బీజ మంత్రం “ఓం” కుండలినీ ఆజ్ఞ చక్రంలో పనిచేయటం ప్రారంభించగానే,అంత వరకు ఇంద్రియాల ద్వారా పని చేస్తున్న మనసు క్రమంగా కుండలినీ వైపుకు మరలుతుంది.
ఆజ్ఞా చక్రంలో తల క్రిందులుగా ఒక త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణం “శక్త” కి ప్రతీక. ఈ త్రికోణం లో ఒక నల్లటి శివలింగం ఉంటుంది. ఈ శివలింగం పైన “ఓం” బీజాక్షరం ఉంటుంది. దాని పైన అర్ధ చంద్రాకారం (present moon) ఉంటుంది. తరువాత ఒక బిందువు ఉంటుంది. ఈ శివలింగం “astral body” కి సూచిక గా చూపిస్తారు. ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత “పరమ శివుడు.” ప్రతి రోజు ఆజ్ఞాచక్రంలో మేడిటేషన్ (ధ్యానం) చేసిన వారికి ఈ క్రింది ప్రయోజనాలు కగుతాయి.
ప్రయోజనములు:
వస్తు వ్యామోహం తగ్గును.
* తనను తాను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
* సన్మార్గంలో నడిచే సామర్ద్యం కలుగుతుంది.
* దురాశను నియంత్రించును,కోర్కేలను అదుపులోనుంచును.
* మనసులో జ్ఞానాభివృద్ధి కలుగును.
* ఆకామ్య కర్మలనుండి విముక్తుడిని చేయును.
* ఏకాగ్రత,శ్రద్ద,నేర్పరితనం,ఔన్నత్యము పెంపొందించును.మన:శాంతి కలుగును.
* ఆరోగ్యము పెంపొందించును,ముఖము తేజోవంతమగును.