Karthika Puranam Day 14 Adhyayam

Karthika Puranam Day 14 Adhyayam Story

పద్నాలుగో రోజు పారాయణం-కార్తీక పురాణం 14వ అధ్యాయం

Karthika Puranam 14th Day Parayanam

Karthika Puranam Day 14 Adhyayam Story www.stotraveda.com
Karthika Puranam Day 14 Adhyayam Story
కార్తీకపురాణం – 14వ రోజు పారాయణము
ఆబోతుకు అచ్చువేసి వదులుట
 

మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||

”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.

కార్తీక మాస శివ పూజ కల్పము:
1 ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి
2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి
4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తంపద్నాలుగో రోజు పారాయణం సమాప్తం

 

Slokas Format:

కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం
అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్దశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

వసిష్ఠఉవాచ
పౌర్ణమ్యాంకార్తికేమాసి వృషోత్సర్గం కరోతియః
తస్యపాపాని నశ్యమ్తి జన్మాంతరకృతానిచ!!
తాత్పర్యం:
వసిష్ఠుడు చెప్పుచున్నాడు, కార్తీకపౌర్ణమిని వృషోత్సర్జనము చెయుటవలన జన్మాంతర పాపములు నశించును. (వృషోత్సర్జనము అనగా ఆంబోతును వదులుట)యఃకార్తికేవృషోత్సర్గం పౌర్ణమ్యాంపితృతృప్తయే
సంకుర్యాద్విధినా రాజన్ తస్యపుణ్యఫలంశ్రుణు!!
గయాశ్రాద్ధంకృతంతేన కోటివారంనసంశయః
పుణ్యదం మానుషేలోకే దుర్లభం కార్తికవ్రతమ్!!

తాత్పర్యం:
కార్తీకమాస వ్రతము ఈ మనుష్యలోకంలో దుర్లభము, అనగా సులభముగా ముక్తిమార్గమునిచ్చునని భావము, కార్తీకపున్నమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్జనమును చేయువానికి కోటిరెట్లు గయాశ్రాద్ధఫలము చెందుతుంది.యఃకోవాస్మత్కులేజాతః పౌర్ణమాస్యాంతు కార్తికే
ఉత్సృజేద్వృషభంనీలం తేనతృప్తావయంత్వితి
కాంక్షఁతినృపశార్దూల పుణ్యలోకస్థితా అపి!!
పౌర్ణమ్యాం కార్తికేమాసి ఆఢ్యో వాప్యధమోపివా
నోత్సృజేద్వృషభంలోభా త్సయాత్యంధతమోయమాత్!!
పిండదానాద్గయా శ్రాద్ధా త్ప్రత్యబ్దం ప్రతివత్సరే
పుణ్యతీర్థాసంగమనా త్తర్పణాచ్చమహాలయాత్
కార్తికేపౌర్ణిమాస్యాంతు వృషోత్సర్గం వినాగతిః!!
గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణః
ప్రశస్తమూర్జెపౌర్ణమ్యాం వృషోత్సర్గస్సుఖప్రదః!!

తాత్పర్యం:

స్వర్గమందున్న పితరులు మనవంశమందు ఎవరైనా కార్తీకపున్నమినాడు నల్లని గిత్తను విడుచునా? ఆ విధముగ ఎవరైనా వృషోత్సర్జనము చేసిన తృప్తిపొందెదము అని కోరుకుంటూంటారు. ధనవంతుడుగానీ, దరిద్రుడుగానీ, కార్తీకపున్నమినాడు లోభమువల్ల వృషోత్సర్గమను ఆంబోతునువిడుచుక్రియను చేయనివాడు యమలోకమున అంధతమిస్రమను నరకమును పొందెదరు. కార్తీకపున్నమి రోజున వృషోత్సర్గమును చేయక, గయాశ్రాద్ధము చేసిననూ ప్రతిసంవత్సరమూ తద్దినము పెట్టిననూ పుణ్యతీర్థములు సేవించిననూ మహాలయము పెట్టిననూ పితరులకు తృప్తిలేదు. గయాశ్రాద్ధమును, వృషోత్సర్జమును సమానమని విద్వామ్సులు చెప్పిరి, కనుక, కార్తికపున్నమి నాడు వృషోత్సర్జనము సుఖమునిచ్చును.

యఃకుర్యాత్కార్తికేమాసి సర్వధర్మాధికం ఫలం
ఋణత్రయాద్విముచ్యేత కిమన్యైర్బహుభాషణైః!!
యోధాత్రీఫలదానంతు పౌర్ణమ్యాంచసదక్షిణం
కురుతె నృపశార్దూల సార్వభౌమోభవేద్ధృవమ్!!
యంకుర్యాద్దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికేనఘ
సర్వపాపవినిర్ముక్తో తతో యాంతి పరాంగతిమ్!!
కర్మణామనసావాచా పాపంయస్సమ్యగాచరేత్
తస్యపాపానినశ్యంతి కార్తిక్యాందీపదానతః!!
లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాంశివతుష్టయే
ఇహసమ్యక్ఫలం ప్రాప్య సార్వభౌమోభవేద్ధ్రువమ్!!
పాపఘ్నం పుణ్యదంప్రాహుర్లింగదానం మనీషిణః
లింగదానమనాదృత్య యఃకుర్యాత్కార్తికవ్రతం
వజ్రలేపోభవేత్తస్య పాపరాశిర్నసంశయః!!

 
తాత్పర్యం: 
అనేక మాటలేల? కార్తీకపున్నమినందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానముచేయువాడు దేవ-పితృఋణ, ఋషిఋణ, మనుష్యఋణములనుమ్చి విముక్తినొందును. కార్తీకపూర్ణిమనాడు దక్షిణతోకూడి ధాత్రీఫలమును దానమిచ్చినవాడు సార్వభౌముడగును. కార్తీక పూర్ణిమనాడు దీపదానమాచరించినవారు విగతపాపులై పరమపదమునొందెదరు. కార్తీకమాసమమ్దు దీపదానమాచరించువాని మనోవాక్కాయములచేత చేసిన పాపములు నశించును. కార్తీకపున్నమి నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమునందు అనేక భోగములననుభవించి ఉత్తరజన్మమందు సార్వభౌముడగును. లింగదానము వలన పాపములు శమించి, పుణ్యము గలుగును, కార్తీకమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమూ కరుగవు.

అనంతఫదంప్రోక్తం దుర్లభం కార్తికవ్రతం
పరాన్నంపితృశేషంచ నిషిద్ధస్యచ భక్షణం
శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికేవం చ వర్జయేత్!!
గణాన్నంవృషలస్యాన్నం దేవలాన్నమసంస్కృతం
వ్రాత్యాన్నంవిధవాన్నంచ కార్తికేషడ్వివర్జయేత్!!
అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దేభానువాసరే
సోమసూర్యోపరాగేచ ఊర్జేననిశిభోజనమ్!!
ఏకదశ్యామహోరాత్రం వ్యతీపాతేచ వైధృతౌ
నిసిద్ధదివసేరాజన్ గృహీయః కార్తికవ్రతే!!
విష్ణోర్దినస్యయత్నేన పూర్వోత్తరదినద్వయే
మాసనక్తవ్రతాధీనో నకుర్యాన్నిశిభోజనమ్
నిషిద్ధదివసేప్రోక్తం ఛాయానక్తంమహర్షిభిః
నక్తవ్రతఫలంతేన న నక్తంనిశిభోజనమ్!!
సర్వపుణ్యప్రదెరాజన్ కార్తికేమాసియఃపుమాన్
నిషిద్ధదివసేచాన్నం భోజనంకురుతేయది
తస్యపాపస్యవిస్తారం కథం తేప్రబ్రవీమ్యహమ్!!

తాత్పర్యం:
కార్తీకవ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీకమాసమునందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువులు తినుట, శ్రాద్ధాన్నము సేవించుట, తిలదానము గ్రహించుట ఈ ఐదూ విడువవలెను. కార్తీకమాసమమ్దు సంఘాన్నము, శూద్రాన్నము, దేవతార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మలను విడువుమని చెప్పువాని అన్నము, విధవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమందు అమావాస్యయందు, పున్నమియందు పితృదినమందు ఆదివారమందు సూర్యచంద్ర గ్రహణములందు రాత్రిభోజనము నిషిద్ధము. కార్తీకమాసమందు ఏకాదశినాడు రాత్రింబగళ్ళు, వ్యతీపాత వైధృతి యోగాది నిషిద్ధ దినములందు రాత్రి భోజనము చేయరాదు. మాస నక్తవ్రతము ఆచరించిన వాడు ఈ ఏకాదశికి పూర్వోత్తరదినములందును రాత్రిభుజించరాదు. అప్పుడు ఛాయానక్తభోజనము చేయవలెను కానీ రాత్రిభోజనము చేయరాదు. ఛాయానక్తమే రాత్రిభోజన ఫలమిచ్చును. కనుక రాత్రిభోజనముగూడ దినములందు కార్తీకవ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహింపవలెను ఛాయానక్తము అనగా సాయంత్రము తనశరీరమునకు రెండింతలు నీడ వచ్చినప్పుడు భోజనము చేయుట. యిదినిషిద్ధదినములలో గృహస్థులకు, ఎల్లప్పుడు యతి-విధవలకు హితము. సమస్త పుణ్యములనిచ్చు ఈ కార్తీకమాసమందు నిషిద్ధదినములందు భుజించువారి పాపములు అనంతములగును.తస్మాద్విచార్యయత్నేన కార్తికవ్రతమాచరేత్
తైలాభ్యంగందివాస్వాపం తథావైకాంస్యభోజనం
మఠాన్నిద్రాంగృహేస్తానం నిషిద్ధేనిశిభోజనం
వేదశాస్త్రవినిమ్దాంచ కార్తికేసప్తవర్జయేత్!!
ఉష్ణోదకేనకర్తవ్యం స్నానంయత్రైవకార్తికే
స్నానంతత్సురయాప్రోక్తం నిశ్చితంబ్రహ్మణాపురా
పటుర్భూత్వాగృహేస్నానం యః కుర్యాదుష్ణవారిణా!!
నదీస్నానం తు కర్తవ్యం తులాసంస్థేదివాకరే
కార్తికేమాసిరాజేంద్ర ఉత్తమంతంప్రచక్షతే!!
తటాకకూపకుల్యానాం జలేవాస్నానమాచరేత్
వినాగంగావినాగోదాం వినాతద్వత్సరిద్వరాం
తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్!!
సంప్రాప్యకార్తికంమాసం స్నానం యోనసమాచరేత్
సగచ్చేన్నరకంఘోరం చాండాలీం యోనిమాప్నుయాత్!!
గంగాదిసర్వనదీశ్చ స్మృత్వాస్నానం సమాచరేత్
తతోభివాదనంకుర్యాత్సూర్యమండలగ్ం హరిమ్
కృత్వావిష్ణుకథాందివ్యాం విప్రైస్సార్థంగృహవ్రజేత్!!

తాత్పర్యం:
 కావున, విచారణచేసి ప్రయత్నపూర్వకముగా కార్తీక వ్రతమును ఆచరించవలెను, కార్తీకమాసమందు తైలాభ్యంగనము, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములలో నిద్ర, ఇంట్లో స్నానము, నిషిద్ధ దినములందు భోజనము వేదశాస్త్రనింద కూడదు. కార్తీకమాసములో శరీర సామర్థ్యము కొరకు ఇంటిలో వేడినీటి స్నానము చేయుట కల్లుతో స్నానమాచరించుట యని బ్రహ్మ చెప్పెను, శరీరపటుత్వము / ఆరోగ్యము సరి లేనివారు వేడినీటితో స్నానము చేయవచ్చు. తులయందు సూర్యుడుండగా కార్తీకమందు నదీస్నానమే ముఖ్యము. ఒకవేళ నది దగ్గరలో లేకున్న చెరువు, కాలువ, బావులందు స్నానము చేయవచ్చు. అప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానము చేయవలెను, గంగా గోదావరి మహానదులలో స్నానము చేయునప్పుడు ప్రార్థన అవసరంలేదు. గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక, కూపోదక స్నానము కర్తవ్యము. *కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరవాత ఛండాలుడై పుట్టును*. గంగాది సమస్తనదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన ఆ శ్రీహరిని ధ్యానించి హరిచరిత్రను విని ఇంటికెళ్లవలెను.

దినాంతె సర్వకర్మాణి సమాప్యవిధినానృప
పాదౌప్రక్షాళ్యచాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్
పూజయేదీశ్వరంతత్ర షోడశైరుపచారకైః
పీఠస్థంపూజయేచ్చంభుం కల్పోక్తవిధినాఽనఘ
పంచామృతవిధానేన ఫలతోయైఃకుశోదకైః
స్నాపయేత్పుణ్యసూక్తైశ్చ భక్త్యాగౌరీపతింప్రభుమ్!!
తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం
వృషధ్వజాయధ్యానంచ పాద్యంగౌరీప్రియాయచ
అర్ఘ్యంలోకేశ్వరాయేతి రుద్రాయాచమనీయకం
స్నానంగంగాధరాయేతి వస్త్రమాశాంబరాయచ
జగన్నాధాయోపవీతం గంధం కపాలధారిణే
అక్షతానీశ్వరాయేతి పుష్ఫంపూర్ణగుణాత్మనె
ధూమ్రాక్షాయేతి ధూపంవై తేజోరూపాయదీపకం
లోకరక్షాయనైవేద్యం తాంబూలం లోకసాక్షిణే
ప్రదక్షిణంభవాయేతి నమస్కారం కపాలినే!!

తాత్పర్యం:
పగలు చేయవలసిన వ్యాపారాదులు ఇతర పనులు చేసి, సాయంకాలము తిరిగి స్న్నము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముపై శంకరుని ఉంచి, పంచామృతములతోనూ, ఫలోదకముతోనూ, కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతో పూజించవలెను.శంకరుని ఆవాహన చేసి
అ) వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి
ఆ) గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి
ఇ) లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి
ఈ) రుద్రాయ ఆచమనీయం సమర్పయామి
ఉ) గంగాధరాయ స్నానం సమర్పయామి
ఊ) ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి
ఋ) జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి
ౠ) కపాలధారిణే గంధం సమర్పయామి
ఎ)ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి
ఏ) పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి
ఐ) ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి
ఒ) తేజోరూపాయ దీపం సమర్పయామి
ఓ) లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి
ఔ) లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి
అం) భవాయ ప్రదక్షిణం సమర్పయామి
అః) కపాలినేనమః నమస్కారం సమర్పయామి
అని ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను.ఏతైర్యోనామభిర్భక్త్యా పూజయేద్గిరిజాపతిం
శంభోర్నామసహస్రేణ మాసమేకంనిరంతరం
పూజాం తేచార్పయేదర్ఘ్యం మాసనక్తవ్రతేనృప
*//పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రిపంకజ*
*అర్ఘ్యం గృహాణదైత్యారె దత్తచేదముమాపతే//*
అర్చయేచ్ఛంకరంభక్త్యా యస్సధన్యోనసంశయః!!

తాత్పర్యం:
పైన చెప్పిన శంకరనామములచే పూజించి ఈ నెలయంతా శివ సహస్రనామములచేత నిత్యము పూజించి పూజావసానమందు ఈ పైన చెప్పిన శ్లోకరూప మంత్రము (” పార్వతీకాంత… ముమాపతే… “) తో అర్ఘ్యము యివ్వవలెను. ఇలా అర్ఘ్యమునిచ్చినవాడు ధన్యుడై ముక్తుడగును. అనుమానము లేదు.తథావిత్తానుసారేణ దీపమాలార్పణం నృప
దత్వాదానంతువిప్రేభ్యో విత్తశాఠ్యంనకారయేత్!!
ఏవంవిప్రవరైస్సార్థం నక్తంయఃకార్తికవ్రతీ
కురుతేనృపశార్దూల తస్యపుణ్యఫలం శ్రుణు
అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతానిచ
అశ్వమేధసహస్రాణాం ఫలం ప్రాప్నోత్యసంశయః!!
మాసనక్తంచయఃకుర్యాదిత్యేవంవిధినానఘ
పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః!!
మాసనక్తం మహత్పుణ్యం సర్వపాపవినాశనం
సర్వపుణ్యప్రదంనౄణాం కార్తికేనాత్రసంశయః!!
యఃకార్తికేచతుర్ధశ్యాం పితౄనుద్ధిశ్యభక్తితః
బ్రాహ్మణంభోజయేద్దేవంప్రీణంతిపితరోఽఖిలాః!!
యఃకార్తికేసితేపక్షే చతుర్దశ్యాంనరేశ్వర
ఔరసఃపితృభక్తోయస్తిలైస్సంగతర్పయేజ్జలే
ప్రీణంతిపితరస్సర్వే పితృలోకంగతాఅపి!!

తాత్పర్యం:
తన శక్తికొలది దీపమాలలను సమర్పించి శక్తివంచనలేక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడిన నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయయాగములు వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము బొందును. కార్తీకా మాసములో ఈ ప్రకారము మాసనక్తవ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును, సమస్తపాపములు నశించును ఇందులో సందేహములే లేవు. కార్తీకమాసమందు చతుర్దశి పితృదేవతలప్రీతికొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులు తృప్తిపొందెదరు. కార్తికమాసమమ్దు శుక్ల చతుర్దశియమ్దు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించినచో పితృలోకవాసులైన పితరులు తృప్తిపొందెదరు.

యఃకుర్యాత్ఫలదానంతు చతుర్ధశ్యాంతుకార్తికే
సతస్యసంతి తేర్హానిర్జాయతేనాత్రసంశయః!!
యఃకుర్యాత్తిలదానంతుచతుర్దశ్యాంతుకార్తికే
ఉపోష్యశంకరంపూజ్య సకైలాసేశ్వరోభవేత్!!
సర్వపాపప్రశమనం పుణ్యదం కార్తికవ్రతమ్
యఃకుర్యాత్సోపిపాపేభ్యో విముక్తోమృతమశ్నుతే!!
ఇదంపవిత్రంపరమమ్ అధ్యాయం యశ్శ్రుణోత్యతః
ప్రాయశ్చిత్తంపరంప్రాహుః పాపానాంనాత్రసంశయః!!

తాత్పర్యం:
కార్తీకమాసమందు చతుర్దశి నాడు ఫలదాన మాచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహములేదు. కార్తీకమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించినవాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టునదీ, సమస్తపుణ్యములను వృద్ధిపరచునది ఐన కార్తీకవ్రతమును చేయువాడు పాపములు నశించి మోక్షమునొందును. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్తపాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే చతుర్దశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.