Karthika Puranam Day1 Adhyayam Story
మొదటిరోజు పారాయణం-కార్తీక పురాణం 1వ అధ్యాయం
Karthika Puranam First Day Parayanam
శ్రీ విఘ్నశ్వర ప్రార్థన:
శ్లో ” వాగీశాద్యా స్సుమనస స్సర్వార్థానా ముపక్రమే !
యంనత్వా కృతకృత్యాస్స్యు స్తంనమామి గజాననమ్ !!
శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట:
శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియందలి-శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిశారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి, సంతుష్టుని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులాయనాను పరివేష్టించినవారై – ‘సకల పురాణగాథా ఖనీ! సూతమునీ! కలికల్మష నాశకమూ – కైవల్యదాయకమూ అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయు’మని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన నూతర్షి -“శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్వ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి యున్నారు. బుషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలమణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహాత్వ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్యపారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్వ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడు.
జనకుడు వశిష్ఠుని కార్తీకవ్రత ధర్మములడుగుట:
పూర్వమొకసారి సిద్దాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ట మహర్షి, జనకమహారాజు యింటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు నందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా యిస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాస మత్యంత మహిమాన్వితమైనదనీ, తద్ర్వతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది” అని అడుగగా – మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, యిలా ప్రవంచినాడు.
వశిష్ట ప్రవచనము:
“జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని, సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే యిటువంటి పుణ్యప్రదమైనదీ, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన – కార్తీక మహాత్వ్యమును వినాలచే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో వుంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహా! కార్తీకమాసములో సూర్యుడు తులాసంక్రమణములో నుండగా – సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులాసంక్రమణాదిగా గాని, శుద్ధి పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా..
శ్లో” “సర్వపాప హరంపుణ్యం వ్రతం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే “
“ఓ దామోదరా! నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము’ అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని, కార్తీక స్నానమారంభించాలి. కార్తీకమందలి సూర్యోదయవేళ కావేరీనదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవికాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందునా చేరుతుంది. వాపీకూప తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడయిన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై, కాళ్ళూ-చేతులూ కడుగుకొని, ఆచమించి, శుద్డాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, బుషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో, బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసెళ్ళ నీళ్ళను గట్టుమీదకు జిమ్మి, తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణమంటారు. అనంతరం ఒళ్లు తుడుచుకుని, పొడివి-మడివి-తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్థ్వపుండ్రాలను ధరించి, సంధ్యావందన గాయత్రీ జపాలనాచరించాలి. ఆ తరువాయిని – ఔపాసనము చేసి, బ్రహ్మయజ్ఞ మాచరించి, తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ-చక్రధారియైన విష్ణువును – సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమునుగాని, శ్రవణమును గాని ఆచరించినవాడై, స్వగృహాన్ని చేరి, దేవతార్చన, వైశ్య దేవాదులను చేసి – భోజనమును చేసి, ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి.
సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని- శివాలయములోగాని, విష్ణ్వాలయములోగాని యథాశక్తి దీపాలను బెట్టి అక్కడి స్వామినారాధించి, భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా యీ వ్రతాన్ని యెవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా! తనకు తానుగా యీ వ్రతాన్ని ఆచరించలేకపోయినా – ఇతరులు చేస్తుండగా చూసి, అసూయరహితుడై ఆనందించే వానికి – ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.