Karthika Puranam Day 10 Adhyayam

Karthika Puranam Day 10 Adhyayam Visit www.stotraveda.com
Karthika Puranam Day 10 Adhyayam

Karthika Puranam Day 10 Adhyayam Story

పదవ రోజు పారాయణం-కార్తీక పురాణం 10వ అధ్యాయం
Karthika Puranam 10th Day Parayanam -Karthika Puranam Day 10 Adhyayam

కార్తీకపురాణం – 10వ రోజు పారాయణము

అజామీళుని జన్మ వృత్తాంతం:

అజామీళుని వృత్తాంతమంతా విన్న జనక మహారాజు వశిష్టుడితో ఇలా అడుగుతున్నారు… ”ఓ మహానుభావా.. అజామీళుడు ఎంతటి నీచుడైనా అంత్యకాలాన నారాయణ మంత్ర పఠనంతో విష్ణుసాన్నిధ్యాన్ని పొందిన తీరును చక్కగా వివరించారు. అయితే నాకో చిన్న సంశయం. గత జన్మ కర్మ బంధాలు ఈ జన్మలో వెంటాడుతాయన్నట్లు అజామీళుడు కూడా గత జన్మలో చేసుకున్న కర్మలే ఆయనకు మోక్షాన్ని కల్పించాయా?” అని ప్రశ్నించారు.. దానికి మునివర్యులు ”ఓ జనక మహారాజా! నీకు వచ్చిన సందేహమే యమదూతలకు కూడా వచ్చింది. ఆ వృత్తాంతం… అజామీళుడి జన్మ వృత్తాంతం చెబుతాను విను” అని ఇలా చెప్పసాగారు…

అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లాక యమ కింకరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు. ”ప్రభూ! మీ ఆజ్ఞ ప్రకారం అజామీళుడిని తీసుకొచ్చేందుకు వెళ్లాం. అక్కడకు విష్ణుదూతలు వచ్చి, మాతో వాదించి అతన్ని పట్టుకెళ్లారు. చేసేది లేక మేము వట్టిచేతులతో తిరిగి వచ్చాం” అని భయకంపితులై విన్నవించుకున్నారు.

”అరెరె…! ఎంత పని జరిగింది? ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే? దీనికి బలమైన కారణం ఉండొచ్చు” అని తన దివ్యదృష్టితో అజామీళుడి పూర్వజన్మ వృత్తాతం తెలుసుకున్నాడు. ”ఆహా…! అదీ సంగతి. నారాయణ మంత్రంతో అతను విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడు” అని అతని పూర్వజన్మ వృత్తాతం చెప్పసాగాడు.

అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతను అపురైపమైన అందం, సిరిసంపదలు, బలగర్వంతో శవారాధన చేయకుండా ఆలయానికి వచ్చే ధనాన్ని దొంగతనం చేస్తుండేవాడు. శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా, దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కోసారి శివుడికెదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు.

అతనికి ఓ పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడంది. ఆమె కూడా అందమైనది కావడంతో ఆమె భర్త చూసీచూడనట్లు వ్యవహరించేవాడు. అతను భిక్షాటనకు ఊరూరూ తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి, యాచన చేసిన బియ్యం, కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసటతో… ”నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది. త్వరగా వంటచేసి, వడ్డించు” అని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు చీదరించుకుని, నిర్లక్ష్యంతో కాళ్లు కడుగుకొనేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. తన ప్రియుడిపై మనస్సుగలదై భర్తను నిర్లక్ష్యం చేసింది. ఇది భర్త కోపానికి దారి తీసింది. దీంతో అతను కోపంతో ఓ కర్రతో బాదాడు. ఆమె ఆ కర్రను లాక్కొని, భర్తను రెండింతలు ఎక్కువ కొట్టి, ఇంటి బయట పారేసి, తలుపులు మూసేసింది. అతను చేసేదిలేక, భార్యపై విసుగు చెంది, దేశాటనకు వెళ్లిపోయాడు. భర్త ఇంటినుంచి వెళ్లిపోవడంతో సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుమీద కూర్చుంది.

అటుగా వెళ్తున్న ఓ రజకుడిని పిలిచి… ”ఓయీ… నువ్వు ఈ రాత్రికి నా దగ్గరకు రా. నా కోరిక తీర్చు” అని కోరింది. దానికి అతను ”అమ్మా! నువ్వు బ్రాహ్మణ పడతివి. నేను రజకుడిని. మీరు అలా చేయడం ధర్మం కాదు. నేను ఆ పాపపు పనిని చేయలేదు” అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ రజకుడి అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, ఆ గ్రామ శివార్చకుడి (అజామీళుడి పూర్వజన్మ) దగ్గరకు వెళ్లింది. వయ్యారాలు వలుకబోస్తూ… తన కామవాంఛ తీర్చమని పరిపరివిధాలా బతిమాలింది. ఆ రాత్రంతా అతనితో గడిపింది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి… ”అయ్యో! నేనెంతటి పాపానికి ఒడిగట్టాను? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను వెళ్లగొట్టి, క్షణికమైన కామవాంఛకు లోనై… మహాపరాధం చేశాను” అని పశ్చాత్తాపపడింది. ఒక కూలీవాడిని పిలిచి, కొంత ధనమిచ్చి, తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది. కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ఇంటికి తిరిగిరాగా… పాదాలపై పడి తన తప్పులను క్షమించమని వేడుకుంది. అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త అనురాగాలను సంపాదించింది.

కొంతకాలానికి ఆమెతో కామక్రీడలో పాల్గొన్న శివార్చకుడు వింత వ్యాధితో రోజురోజుకీ క్షీణిస్తూ మరణించాడు. అతను రౌరవాది నరకాల బారిన పడి, అనేక బాధలు అనుభవించి, మళ్లీ నరజన్మ ఎత్తాడు. సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముని కొడుకుగా పుట్టాడు. గత జన్మలో ఆ బ్రాహ్మణుడు చేసిన కార్తీక స్నానాల వల్ల అతనికి తిరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తించింది. అతనే అజామీళుడు. ఇక ఆ బ్రాహ్మణ మహిళకూడా కొంతకాలానికి చనిపోయి, అనేక నరకబాధలు అనుభవించింది. ఆ తర్వాత ఓ హరిజనుడి ఇంట పుట్టింది. ఆమె జాతకం ప్రకారం తండ్రికి గండం ఉందని తేలడంతో… అతను ఆమెను అడవిలో వదలగా… అక్కడ ఒక ఎరుకలవాడు ఆమెను పెంచాడు. ఆ అమ్మాయే పెరిగి, పెద్దదై అజామీళుడిని మోహించింది. కులాలు వేరుకావడంతో కులసంకరం చేసి, ఇద్దరూ కలిసిపోయారు. అజామీళుడు ఈ జన్మలో కులసంకరం చేసినా… కేవలం అంత్యకాలాన నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని యమధర్మరాజు యమభటులకు వివరించిన తీరును జనక మహారాజుకు వశిష్టుడు చెప్పెను.

ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదవ అధ్యాయము

పదవ రోజు పారాయణము సమాప్తము.

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం