Karthika puranam Day 13 Adhyayam Story
పదమూడో రోజు పారాయణం-కార్తీక పురాణం 13 వ అధ్యాయం
Karthika Puranam 13th Day Parayanam
Karthika Puranam Day 13th Adhyayam- కార్తీకపురాణం – 13వ రోజు పారాయణము
కన్యాదాన ఫలం, సువీరచరిత్రము
తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…
సువీర చరితం:
పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.
అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.
ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.
అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.
వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.
శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.
”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:
Karthika Puranam Day 13th Adhyayam -పదమూడో రోజు పారాయణం సమాప్తము.
మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం
Karthika Puranam Day 13th Adhyayam – Slokas Format:
అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే త్రయోదశోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం
వసిష్ఠఉవాచ
అధేధానీంప్రవక్షెహం ధర్మాన్కార్తిక సమ్భవాన్
ప్రశస్తాత్మాసవైభూప తథాచావశ్యకాంచ్ఛ్రుణు!!
తాత్పర్యం:
వసిష్ఠుడు మరల చెప్పనారింభిచెను ” ఓ రాజా, కార్తీక మాసములో చేయదగిన ధర్మములను చెప్పదను “స్వఛ్ఛమైన మనసుతో ” వినుము ఆధర్మములన్నీ ఆవశ్యము ఆచరించవలసినవి”
సంసారభయభీతస్య పాపభీరోర్నరస్యచ
కార్తికేమాసియత్ప్రోక్తం మత్పిత్రావిధినాపురా
సత్యంబ్రవీమికర్తవ్యాన్ నోచేత్పాపసంభవేన్నృప!!
కన్యాదానంతులాస్నానం శిష్టపుత్రోపనాయనం
విద్యావస్త్రాన్నదానాని ఊర్జెశస్తానిభూపతే!!
విత్తహీనస్య విప్రస్య సూనోశ్చావ్యుపనాయనం
సదక్షిణంసంభారం ఊర్జెదత్వానరోనఘ
తస్యపాపానినశ్యంతి కృతానిబహుళాన్యపి!!
జపేనైకేనగాయత్ర్యా ద్రవ్యదాతుఃఫలంశ్రుణు
అగమ్యాగమనాదీని హత్వాదీనిసహస్రశః
తథాన్యాన్యుగ్రపాపాని భస్మసాద్యాంతిభూమిప!!
గాయత్రీం దేవ దేవస్య పూజాస్వాధ్యాయనార్పణం
ఏతేషామధికం పుణ్యం మయావక్తుంనశక్యతె!!
తాత్పర్యం:
రాజా! కార్తీక ధర్మములు మాతండ్రియైన బ్రహ్మచే నాకు చెప్పబడినవి, అవి అన్నీ నీకు తెలిపెదను. అన్నియు ఆచరించదగినవే, అవి చేయని పక్షంలో పాపము సంభవిమ్చును. ఇది నిజము, సంసార సముద్రమునుంచి ఊరట కోరుకునేవారు నరకాది భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసములో కన్యాదానము ప్రాతస్స్నానము శిష్టుడైన బ్రాహ్మణపుత్రునికుపనయనము చేయించుట విద్యాదానము వస్థ్రధానము అన్నదానము యివి ముఖ్యము. కార్తీకమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనముచేయించి దక్షిణ యిచ్చిన యెడల అనేక జన్మార్జిత పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రి జపఫలమువలన పంచమహాపాతకములు బూదియగును. గాయత్రీజపము, దేవతార్చన, వేదగానము, వీటిఫలము చెప్పుటకు నాకు శక్యముగాదు.
తటాకాయుతనిర్మాణం అశ్వత్థారోపణంశతం
కోటయఃకూపవాపీనాం క్రమాన్నందనపాలనాత్
బ్రహ్మప్రతిష్ఠాపుణ్యస్య కలాంనార్హంతిషోడశీమ్!!
మాఘ్యాంవై మాధవేమాసి చోత్తమంమౌంజిబంధనమ్
కారయిష్యంతిరాజన్ దానందత్వాతుకార్తికే!!
సాధుభ్యశ్శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యోయథావిధి
తథాతేషాంసుతానాంచ ప్రకుర్యాన్మౌంజిబంధనం
తేనానంతఫలంప్రాహుఃర్మునయోధర్మవిత్తమాః!!
తథాతేషాంవిధానంచ కార్తికేమాసిధర్మవిత్
కుర్యాత్తస్యఫలంవక్తుం కశ్శక్తోదివివాభువి!!
సోపితీర్థానుగమనం దేవబ్రాహ్మణతర్పణమ్
యంకర్మకురుతెవాపి ద్రవ్యదాతుఃఫలంలభేత్!!
మౌంజీవివాహమేకస్య యఃకుర్యాన్మేదినీపతే
దత్వార్థం కార్తికేమాసి తదనంతఫలంస్మృతమ్!!
కన్యాదానంతు కార్తిక్యాం యణుర్యాద్భక్తితోఽనఘ
స్వయంపాపైర్వినిర్ముక్తః పితౄణాం బ్రహ్మణః పదమ్!!
తాత్పర్యం:
పదివేల చెరువులు తవ్వించిన పుణ్యము, వంద రావి చెట్లు పెట్టించిన పుణ్యము, నూతులు, దిగుడుబావులు వందుకు పైగా తవ్వించు పుణ్యము, వంద తోటలు పెంచుపుణ్యము ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవ వంతుకు కూడ సరిపోవు. కార్తీక మాసందుపనయన దానము చేసి తరవాత మాఘమాసమునకానీ, వైశాఖమునకానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులు ఐన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంతఫలముగలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనమున సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను, అలా చేసినచో కలిగెడి ఫలము చెప్పుటకు భూమిపై, స్వర్గంలో ఎవరికీ సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణులతృప్తిపరచుట చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్య దాతకే చెందును. కార్తీకమాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకుపనయనము వివాహము చేయించిన అనంతఫలము కలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించేవారు తాను పాపవిముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తికలుగించినవాడగును.
అత్రైవోదాహరంతీమం పురావృత్తం మహీపతే
తచ్ఛ్రుణుస్సబ్రవీమ్యేవం భక్త్యామైధిలసాదరమ్!!
దావరేబాహుజఃకశ్చిద్దురాత్మావంగదేశగః
సోపినామ్నాసువీరేతి బహుశౌర్యపరాక్రమః
రాజ్ఞన్తస్యమహీపాల భార్యాబాలమృగేక్షణా!!
సోపికాలాత్తుదాయాదై ర్నిర్జితోవనమావిశత్
అర్థాంగ్యాభార్యయాసాకం విచరన్ గహనేవనే
దుఃఖేనమహతాయుక్తో నిర్థనశ్చ మహీపతిః!!
తత్రసాగుర్విణీతస్య భార్యావన్యఫలాశనా
నిర్మలేనర్మదాతీరే పర్ణశాలాం మహీపతి
తతః కాలేప్రసూతాసా కన్యకాంతత్రసుందరీమ్!!
సమరక్షయత్తతోరాజా పూర్వసౌపమనుస్మరన్
వృద్ధింగతారాజకన్యా సుకృతేన పురాకృతా
రూపలావణ్యసంపన్నా నయనోత్సవకారిణీ!!
తాత్పర్యం:
ఓ రాజా! ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు చెప్పెదను సావధానముగా వినుము. ద్వాపరయుగంలో వంగదేశమునందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడుండెడివాడు. వానికి జింకకన్నులు చూపుల వంటి చూపుగల ఒక స్త్రీ అతనికి భార్యగానుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమున దాయాదులచేత జయింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను తీసుకొని అరణ్యమునందు జీవించుచు చాలా దుఃఖమునొందెను. ఆ అరణ్యమునందు రాజు భార్యయు కందమూలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండెను. ఆ విధముగా జీవనము చేస్తుండగా ఆమె గర్భవతియయ్యెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాల నిర్మించి వారు ఉండసాగెను, ఆ పర్ణశాలయందు ఆ సుందరి ఒక కూతురిని కనెను. రాజు అరణ్యనివాసము, వనములో దొరుకు ఆహారము ఆసమయంలో సంతానసంభవము కలుగగా సంతాన పోషణకు ద్రవ్యము లేకపోవడం అన్నీ తలచుకుని తన పురాకృతమైన పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. కొంకాలమునకు పూర్వపుణ్యవశము చేటా ఆ బాలిక వృద్దినొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ అలరారి చూచువారికి నేత్రానందము కలిగించుచునదాయెను.
అష్టవర్షాంమనోరమ్యాం దృష్ట్వాకశ్చిన్మునేస్సుతః
వివాహార్థంమతించక్రే సువీరంసమయాచత!!
తతోవాచతతస్సోపి దరిద్రోహంమునేస్సుత
ద్రవ్యం దేహియధోద్ధిష్టం ఉద్వాహంయదికాంక్షసే!!
ఇతి భూపవచశ్శ్రుత్వా కన్యాసంసక్తమానసః
మునిసూనురువాచేదం రాజానం మిధిలేశ్వర!!
దాస్యామిద్రవిణభూరి రాజన్ తేహంతపోబలాత్
తేనతెరాజ్యసౌఖ్యాని భవిష్యంతి న సంశయః
ఇతిశ్రుత్వావనెరాజా ఓమిత్యాహముదాన్వితః!!
తపశ్చచారతత్తీరే మునిసూనురుదారధీః
తత్రరాజన్బలాద్ద్రవ్యం సమాకర్ష్యహ్యతంద్రితః
తత్సర్వమర్థంనృపతేః ప్రదదేమునిపుత్త్రకః!!
గృహీత్వార్థంవసూన్ రాజా హర్షాల్లబ్ధమనీరధః
వివాహమకరోత్కన్యాం మునేస్తాపసజన్మనః
స్వగృహ్యోక్తవిధానేన కన్యాముద్వాహద్వనేః!!
తాత్పర్యం:
ఆచిన్నదానికి యుక్త వయస్సు వచ్చినది, మనస్సుకు బహురమ్యముగా ఉన్నది, యిట్లున్న కన్యకనుచూసి ఒక మునికుమారుడు సువీరా నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటవిని ఆ రాజు, నాకూతురిని మునికుమారునికా అని ఆలోచించి, నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనమిచ్చిన నా కన్యకామణిని నీకిస్తానని చెప్పెను. ఈ మాటవిని ఆకన్యయందు కోరికతో ఆ ముని కుమారుడు సరేయని ఒప్పుకొనెను. ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదిమ్చి బహుద్రవ్యమును నీకిచ్చెదను దానితో నీవు సుఖముగానుండు అని చెప్పి ఆవిధముగానే చేసెను. తరవాత ఆ ముని కుమారుడు నర్మదా తీరమున తపమాచరిమ్చి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును రాజునకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తన కూతురిని ఆ మునికుమారునకిచ్చి తన గృహ్యసూత్రప్రకారముగ పెండ్లి చేసెను.
సవోఢాసాపితత్పార్శ్వం జగామమనుజేశ్వర
కన్యాద్రవ్యేణనిత్యం వై హ్యభూత్సోదరపోషకః!!
పునస్సువీరభార్యాసా ప్రజజ్ఞేకన్యకాంతథా
ద్వితీయాంతనుజాందృష్ట్వా పునర్లబ్ద్వాముదాన్వితః
ఇతఃవరంయధేష్టంమె ద్రవ్యంభూరిభవిష్యతి!!
ఏవం విచిమ్త్యమానేతు పుణ్యేనమహతానృప
అజఆమయతిఃకశ్చిత్స్నానార్థం నర్మదాంప్రతి
పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకయత్!!
తమువాచకృపాసింధుర్యతిఃకౌండిన్యగోత్రజః
కిమర్థమత్రకాంతారేకోభవాన్ వదసాంవ్రతమ్!!
ఏవంబ్రువంతమాహేదం భూపాలంకరుణానిధిం
రాజాహంవంగదేశీయ స్సువీర యితివిశ్రుతః
రాజ్యార్థం తైశ్చదాయాదైర్నిర్జితోస్మివనంగతః!!
తాత్పర్యం:
ఆ కన్యయు వివాహముకాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యావిక్రయద్రవ్యముతో తాను తన భార్యయు సుఖముగా జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి ఈ సారి కన్యను విక్రయించి చాలా ద్రవ్యమును పొందెఅదని తలచి దానితో ఆజన్మాంతము గడచునని భావించెను. రాజట్లు తలచగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాలయందున్న రాజును, భార్యను వారి కూతురుని చూచెను. కౌండిన్యసగోత్రుడైన ఆ ముని దయతో వారిని జూచి ఓయీ నీవెవ్వరవు ఈ అరణ్యమున ఏమిజేయుచున్నావు అని అడిగెను. యతి ఇట్లడిగిన మాటవిని రాజు చెప్పుచున్నాడు, అయ్యా నేను వంగదేశమును పాలించుచున్న రాజును నాపేరు సువీరుడు నాదాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నారాజ్యమును అపహరించిరి నేని ఈ వనమును చేరి నివసించుచున్నాను.
నదారిద్ర్యసమందుఃఖం నశోకఃపుత్రమారణాత్
నచవ్యధానుగమినేన వియోగః ప్రియావహాత్
తస్మాత్తేనై వదుఃఖేన వదవాసంకృతం మయా
శాకమూలఫలాద్యైశ్చ కృతాహారోస్మికాననే!!
కాంతారేస్మిన్తతోజాతా పర్ణగారేతుకన్యకా
తాంప్రాప్తయౌవ్వనాందృష్ట్వా కస్మైవిప్రసుతాయచ
తస్మాద్భూరిధనం విప్ర గృహీతం యన్మయానఘ
నివసామిసుఖంత్వస్మిన్ కిమత్రశ్శోతుమిచ్చసి!!
ఇతిభూపవచశ్శ్రుత్వా పునరాహయతిస్తదా
మూఢవత్కురుషేరాజన్ మహాపాతకసమ్చయమ్!!
కన్యాద్రవ్యేణయోజీవే దసిపత్రంసగచ్ఛతి
దేవాన్ ఋషీన్ పితౄన్ క్వాపి కన్యాద్రవ్యేణతర్పయేత్
శాపందాస్యంతి తేసర్వే జన్మజన్మస్యపుత్రతామ్!!
యఃకన్యాద్రవ్యకలుషాం గృహీత్వావృత్తిమాశ్రయేత్
సోశ్నీయాత్సర్వపాపాని రైరవం నరకం వ్రజేత్!!
సర్వేషామేవపాపానాం ప్రాయశ్చిత్తంవిదుర్భుధాః
కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తంనచోదితమ్!!
తాత్పర్యం:
దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగదుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులు భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమమ్దు పర్ణశాలలో నాకు కుమార్తెపుట్టినది, దానిని యౌవ్వనము రాగానే ఒక మునికుమారునికి బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇలా రాజు చెప్పగా విని ఆ యతి ’ రాజా! ఎంత పని చేసితివి మూఢుని వలె పాతకములను సంపాదిమ్చుకొంటివికదా! కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమున అసిపత్రవనమనునరకమందు నివసిమ్చును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తిచేయుచున్నవానికి వారి ప్రతిజన్మమునందు ఇతనికి పుత్రులు కలుగరని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయుపాపాత్ముడు రౌరవనరకమును బొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్ననూ కన్యావిక్రయపాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడలేదు.
కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాంకన్యకాంతవ
కన్యాదానం కురుష్వత్వం సహిరణ్యోదకేనచ!!
విజ్ఞాయతేజోయుక్తాయ శుభశీలాయధర్మిణే
కన్యాదానంతుయఃకుర్యాత్కార్రిక్యామ్చశుభేదినే
గంగాదిసర్వతీర్థేషు స్నానదానేనయత్ఫలం!!
అశ్వమేధాదభిర్యాగై రుక్తదక్షిణసంయుతైః
యత్ఫలంజాయతేరాజన్ తత్ఫలంసోపిగచ్చతి!!
ఇత్యేవంగదితంశ్రుత్వా రాజారాజకులేశ్వర
యతింధర్మార్థతత్వజ్ఞం బాహుజఃకృపణోబ్రవీత్!!
కుతోలోకఃకుతోధర్మః కుతోదానం కుతఃఫలః
సుఖభోగైర్వినావిప్రదేహేస్మిన్ సుఖకాంక్షిణీ
పుత్రదారాదయస్సర్వేవాసోలంకరణానిచ
గృహక్షేత్రాణిసర్వాణి దేహాద్యాధర్మసాధనం
ద్వితీయాం మేదుహితరం యోద్రవ్యమ్ భూరిదాస్యతి
తస్యదాస్యేన సందేహః విప్రగచ్ఛయథాసుఖమ్!!
తాత్పర్యం:
కాబట్టి, ఈ కార్తీక మాసమమ్దు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురును కన్యాదానపూర్వకముగా వివాహము జరిపించుము. కార్తికమాసమందు చేసెడి విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్తతీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలము యధోదక్షిణసమేతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందెడి ఫలము బొందును. అని ఈ విధముగా ఆ యతి చెప్పినది విని రాజు ఆ సకలధర్మవేత్తయైన ఆ మునితో యిట్లనెను. బ్రాహ్మణుడా ఇదేమిమాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వాసోలంకారములున్నందుకు దేహమును సుఖబెట్టి భోగింపవలె, కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమేమిటి, పాపలోకమేమిటి? ఏదో విధంగా ధనం సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చినవానికి యిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములననుభవించుచూ జీవించెదను. నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము.
తతోయయౌనర్మదాయాం స్నానార్థంనృపపుంగవ
నృపస్యాస్యగతేకాలే కాంతారేమరణుగతః!!
ఆయయుర్యమదూతాశ్చపాశైరాబధ్యపాపినం
యమానుగాదక్షిణాశాంతతోజగ్ముర్యధాగతమ్!!
తత్రతంసమ్యగాలోక్యయమస్తామ్రారుణేక్షణః
నరకేషువిచిత్రేషు బబాధరవినంధనః
తథాసిపత్రెఘోరేచ పితృభిస్సహపాతయత్!!
సువీరస్యాస్వయెకశ్చిచ్చృతకీర్తిర్మహీపతిః
సర్వధర్మాంశ్చ కారాసౌతధాక్రతుశతానిచ
ప్రచకారస్వకంరాజ్యం ధర్మేణమిధిలేశ్వర
పశ్చాత్స్వర్గంసమాసాద్య సేవ్యమానస్సురేశ్చరై!!
సువీరః కర్మశేషేణ పితృభిర్నరకంగతః
తత్రవ్యచింతయద్ధుఃఖాద్యాతనాహేతుమాత్మనః
పూర్వపుణ్యప్రభావేన యమంప్రాహాతినిర్భయః
తాత్పర్యం:
ఆమాటవిని యతి స్నానము కొరకు నర్మదానదికి వెళ్ళిపోయెను, తరవాత కొంతకాలమునకు ఆ అడవిలో సువీరుడు చనిపోయెను. అంత యమదూతలు పాశములతో సహా వచ్చి రాజునుగట్టి యమలోకమునకు తీసుకుపోయిరి. అక్కడ యముడు వానిని జూచి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రమనందు రాజును రాజుపితరులను గూడ పడవేసెను. (అసిపత్రవనము = కత్తులే ఆకులుగాగల దట్టమైన అడవి). ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తియనే వాడొకడు సమస్త ధర్మములను చేసి వందయాగములన్ చేసి ధర్మముగా రాజ్యపాలనము చేఇస్ స్వర్గముబోయి యొంద్రాదులచేత కీర్తింపబడెను. ఈ శ్రుతికీర్తి సువీరుని పాతకవిశేషముల చేత స్వర్గమునుంచి తాను నరకమందు బడి యమయాతనలను పొందుచు ఒకనాడు ఇదేమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారేమని విచారించుకుని ధైర్యముతో ఆయమునితో ఇట్లనెను.
వాక్యంమెశ్రుణుసర్వజ్ఞ ధర్మరాజమహామతే
పాపలేశవిహీనస్య కిమియందుర్గతిర్మమ
సర్వధర్మావృధాయాంతి ప్రోక్తాఃపూర్వమహర్షిభిః
దివ్యంవిహాయనరకాగమనంచనసాంప్రతమ్!!
తాత్పర్యం:
సర్వమును తెలిసిన ధర్మరాజా! నామనవి వినుమయ్యా,, ఎంతమాత్రము పాపము చేయని నాకు ఈ నరకమెట్లు సంభవించినది. అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్ని పాటించిననూ వృధాయయ్యేఖాడ, స్వర్గమందున్న నాకు నరకమెట్లు కలిగినది?
ఇతిశ్రుత్వాయమఃప్రాహశ్రుతకీర్తి సహామతిం
అస్తికశ్చిద్దురాచారో వంశజస్తుతవాద్యవై!!
సోపినామ్నానువిరేతి కన్యాద్వవ్యేణజీవితం
తేనపాపేనపితరః పుణ్యలోకంగతా అపి
దివశ్చ్యుతాభవంతీహ దుష్టయోనిషుభూతలే!!
ద్వితీయాతనుజాతస్య వర్ధతేమాతృసన్నిధౌ
పర్ణాగారెనృపశ్రేష్ఠ నర్మదాయాస్తటేవనే!!
మత్ప్రసాదాద్భువంగచ్ఛ దేహేనానేనచానఘ
తత్రతిష్ఠంతిమునయస్తేషామేతన్నివేదయ
కన్యాంతాంశ్రుతశీలాయ కార్తికేమాసిభక్తితః
కన్యాదానంకురుష్వత్వమ్ సహిరణ్యోదకేనచ!!
సర్వాభరణసంపన్నాం యః కన్యాంకార్తికేనఘ
ప్రయచ్ఛతివిధానేన సోపిలోకేశ్వరోభవేత్!!
తాత్పర్యం:
శ్రుతకీర్తి మాటలు విన్న సమవర్తి చెప్పెను, ’ ఓ శ్రుతకీర్తీ, నీవన్నమాట సత్యమే, కానీ నీ వంశస్థుడైన సువీరుడనువాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్తులైనను నరకమందు పడిపోయిరి. ఆ తరవాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! ఆ సువీరునికి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లితో కలిసి పర్ణశాలయందున్నది, ఆమెకింకనూ వివాహము జరుగలేదు. కాబట్టి నీవు నాప్రభావము వలన ఈ దేహముతో అక్కడికి పోయి అక్కడనున్న మునులతో ఈ మాటను చెప్పి ఆకన్యను యోగ్యుడైన వరునకుయిచ్చి కార్తీకమాసమున కన్యాదాన విధానముగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తయైన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతియగును.
యతికన్యానజాయేత మౌల్యంవాయఃప్రయచ్ఛతి
దాతుర్గోమిధునం మౌల్యం కన్యాదానంతదుచ్యతె
కన్యాదానఫలంతస్య భవిష్యతినసంశయః!!
కురుత్వం ద్రాక్చవిప్రేభ్యః కన్యామూల్యమ్విధానతః
ప్రీణమ్తిపితరస్సర్వే ధర్మేణానేనసంతతమ్!!
శ్రుతకీర్తిస్తధేత్యుక్త్వా యమంనత్వాగృహంగతః
నర్మదాతీరసంస్థాంచ కన్యాంకనకభూషణాం
కన్యదానంతుకార్తిక్యాం చకారాసౌనృపోత్తమః
కార్తికేశుక్లపక్షేతు విధినేశ్వరతుష్టయే!!
తేనపుణ్యప్రభావేన సువీరో యమపాశతః
విముక్తస్స్వర్గమాసాద్య సుఖేనపరిమోదతే!!
తథైవదశవిప్రేభ్యః కన్యామూల్యందదావసౌ
ప్రయాంతి పితరస్సర్వే పుణ్యలోకం మహీపతే
పాపానియానిచోగ్రాణి విలయంయాంతితత్క్షణాత్
తతస్స్వర్గగతోరాజా శ్రుతకీర్తిర్యథాగతమ్!!
యస్తస్మాత్కార్తికేమాసి కన్యాదానం కరిష్యతి
హత్యాదిపాతకై స్సర్వై ర్విముక్తోనాత్రసంశయః!!
వాణ్యానాసులభంయేపి వివాహార్థం నగేశ్వర
సహియంయేప్రకుర్వంతి తేషాంపుణ్యమనంతకమ్!!
యఃకార్తికేప్రనిష్ఠో విధినాతత్సమాచరేత్
సయాతివిష్ణుసాయుజ్యం సత్యంసత్యంమయోదితం
నాచరేద్యదిమూఢాత్మా రౌరవమ్తుసమశ్నుతె!!
తాత్పర్యం:
అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఆ ధనదాతయూ లోకాధిపతియగును, కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరునకు యిచ్చి వివాహము చేసినయెడల కన్యాదాన ఫలమునొందును. కాబట్టినీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము యిమ్ము దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సుఖముపొందుదురు. శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేయని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యకు సువర్ణాభ్హరణభూషితగా చేసి కార్తీకశుక్లపక్షమునందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుపోయి సుఖముగాయుండెను. తరవాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పొయిరి. తానూ యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీకమాసమున కన్యాదాన మాచరించేవాడు విగతపాపుడగును అందులో సందేహము లేదు. కన్యామూల్యమును యివ్వలేనివాడు మాటతోనైనా వివాహ సహాయమును చేసిన వాని పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరిమ్చువాడు విష్ణుసాయుజ్యమును పొందును. ఇది నిజము, నామాటనమ్ముము ఈ విధముగా కార్తీకవ్రతమాచరించనివారు రౌరవాది నరకములను బొందుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి
పదమూడవ అధ్యాయము సమాప్తము