Karthika Puranam Day15 Adhyayam Story
పదిహేనవ రోజు పారాయణం-కార్తీక పురాణం 15వ అధ్యాయం
Karthika Puranam 15th Day Parayanam- Karthika Puranam Day15 Adhyayam
కార్తీకపురాణం – 15వ రోజు పారాయణము
దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వ జన్మస్మృతితో నరరూపమందుట
అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని – జనకా ! కార్తీక మహత్యము గురించి యెంత వివరించిననూ పూర్తి కానేరదు. కాని, మరి యొక యితిహసము తెలియ చెప్పెదను సావధానుడ వై ఆలకింపు – మని ఇట్లు చెప్పెను.
ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతా దర్శనము – చేయలేనివారు కాల సూత్రమనెడి నరకముబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికీ అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యము యిచ్చిన యెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల, అట్టి వారు దేవదుందుభులు మ్రోగు చుండగా విమాన మెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధత్రయోదశి, చతుర్దశి, పూర్ణిమరోజులందైనా నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.
ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్ర ముదీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము మెగ ద్రోసి వృద్దిచేసిన యెడల, లేక , ఆరిపోయిను దీపమును వెలిగించినా అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. విను – మని వశిస్టులవారు యిట్లు చెప్పుచునారు.
సరస్వతి నదీ తీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మనిష్టుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు అ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడి యున్న దేవాలయమును శ్రుభముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్టతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తిని వలసినదేనని అనుకోని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపమువద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురూ వచ్చెను. అది కార్తీక మాసమగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడ గా, ప్రక్క నొక మానవుడు నిలబడి యుండుటను గమనించి “ఓయీ!నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించ గా” ఆర్యా ! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగ, నా అదృష్టముకొలదీ ఆ వత్తి వేలుగుటచే నాపాపములు పోయినుందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మమెత్త వలసివచ్చేనో – దానికి గల కారణమేమిటో విశ దీ కరింపు ” మని కోరెను.
అంత యోగీ శ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టి చే సర్వము తెలుసుకొని ” ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహణుడువు. నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయంచేస్తూ, ధనాశాపరుడవై దేవపూజలు, నిత్యకర్మములు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్దాన్నము తినుచూ, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్ద చింత గలవాడవై ఆడ పిల్లలను అమ్ము వృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడ బెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యిత రులకు యివ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపమును భవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించింది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యుందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్దంచుకొని మోక్షము పొందు ” మని అతనికి నీతులు చెప్పి పంపించెను.
పదిహేనవ రోజు పారాయణము సమాప్తము.