Karthika Puranam Day2 Adhyayam

Karthika Puranam Second Day Parayanam Visit www.stotraveda.com
Karthika Puranam Second Day Parayanam

Karthika Puranam Day2 Adhyayam Story

ద్వితీయాధ్యాయము

రెండవ రోజు  పారాయణం- కార్తీకపురాణం 2 వ రోజు అధ్యాయం

Karthika Puranam Second Day Parayanam- Karthika Puranam Day2 Adhyayam

కార్తీక సోమవార వ్రతము

వశిష్ట ఉవాచ: 

హే జనక మహారాజా! వినినంత మాత్రముచేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్దగా విను సుమా! అందునా, ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే – స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది. 1. ఉపవాసము 2. ఏకభక్తము 3. నక్తము 4. అయాచితము 5. స్నానము 6. తిలదానము1. ఉపవాసము:
శక్తిగలవారు కార్తీక సోమవారంనాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.

2. ఏకభక్తము:
సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నానదానజపాలను యథావిధిగా చేసికొని – మధ్యాహ్నమున భోజనము చేసి , రాత్రి భోజనానికి బదులు శైవతీర్ధమో, తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.

3. నక్తము:
పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.

4. అయాచితము:
భోజనానికై తాము ప్రయత్నించకుండా యెవరైనా – వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ‘అయాచితము’.

5. స్నానము:
పై వాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.


6. తిలదానము:
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.

పై ‘ఆరు’ పద్దతులలో దేవి నాచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ, తెలుసుండి కూడా ఏ ఒక్కదానినీ ఆచరించనివాళ్ళు యెనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చేప్రతి సోమవారము నాడూ కూడా పగలు వుపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ – ఆ రోజంతా భగవద్ద్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక యితిహాసాన్ని చెబుతాను విను.

నిష్ఠురి కథ:
పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ‘నిష్ఠురి’ అనే కూతురుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ వుండే యీమెకు గుణాలు మాత్రం శిష్ఠమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్ఠమై, గయ్యాళిగానూ, కాముకురాలుగానూ చరించే ఈ ‘నిష్ఠురి’ని ఆమె గుణాలరీత్యా ‘కర్కశ’ అని కూడా పిలుస్తూ వుండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రహ్మణుడయిన మిత్రశర్మ అనేవానికిచ్చి, తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడూ, సరసుడూ మాత్రమేకాక సహృదయుడు కూడా కావడం వలన – కర్కశ ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగజొచ్సింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ వుండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక, భార్యను పరత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన – మిత్రశర్మ, కర్కశ పెట్టె కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే వుండేవాడు గాని, యేనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె యెందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని, భర్తను – అత్త మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ ‘నీ ముగుడు బ్రతికి వుండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం” అని రెచ్చగోట్టడంతో – కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి, ఆ శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన సూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విటులబలం యెక్కువ కావడంచేత, అత్తమామలామెనేమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని – ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి, తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడటంతో ‘కర్కశ’ జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళుపడిపోయింది. జిగీబిగీ తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెనసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకుని ఆ నిష్ఠుర, తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లూ, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై, సుఖవ్రణాలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలా జీవిని పాశబద్ధను చేసి, నరకానికి తీసుకువెళ్ళారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు.

భర్తద్రోహికి భయంకర నరకం:

భర్తను విస్మరించి పరపురుషుల నాలింగనము చేసుకున్న పాపానికి – ఆమె చేత మండుతున్న యినుపస్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్ధలు కొట్టినందుకు – ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు కొట్టినందుకు, తన్నినందుకు, దాని పాదాలను పట్టుకుని, కఠినశిలలపై వేసి బాదించాడు. సీసమును గాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పదితరాల వారూ, తదుపరి పది తరాలవారూ – ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళూ కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించినది. పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి, ఒకానొక బ్రాహ్మణ గృహములో వుంటూ వుండేది.

సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట:
ఇలా వుండగా, ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి, శివాభిషేకాదులను నిర్వర్తించి, నక్షత్ర దర్శనానంతరము, నక్త స్వీకారానికి సిద్దపడి, ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తు పడివున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి – ” ఓ విప్రుడా ! రక్షింపు’ మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు – కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే – “ఏమి తప్పు చేశావు?” నిన్ను నేనెలా రక్షించగలను?” అని అడిగాడు.అందుకా కుక్క ‘ఓ బ్రహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామముతో కండ్లు మూసుకుపోయి, జారత్వానికి ఒడిగట్టి, భర్త హత్యకూ, వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాల కనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలననుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది – ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకువచ్చాయో అర్ధము కావడంలేదు. దయచేసి విశదపరుచుమని కోరినది.

బ్రహ్మణుడు సర్వాన్నీ జ్ఞానదృష్టి చేత తెలుసుకుని ‘శునకమా! ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి వుండి – నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిన’దని చెప్పాడు. ఆపై నా జాగిలము ‘కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షమెలా సిద్దించునో ఆనతీయుమని కోరినమీదట, దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో – ఒక సోమవారం వాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన శునకదేహాన్ని పరిత్యజించి – దివ్య స్త్రీ శరీరిణియై – ప్రకాశమానహార వస్త్ర విభూషితయై, పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా! నిస్సంశయ నిశ్రేయసదాయియైన యీ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు’ అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు.

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
దానములు :- నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము :- స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :- ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :- తేజోవర్ధనము

ద్వితీయోధ్యాయ స్సమాప్తః