Karthika Puranam Day6 Adhyayam

Karthika Puranam Sixth Day Parayanam Visit www.stotraveda.com
Karthika Puranam Sixth Day Parayanam

Karthika Puranam Day6 Adhyayam Story

ఆరవ రోజు పారాయణం- కార్తీక పురాణం 6వ అధ్యాయం

Karthika Puranam Sixth Day Parayanam – Karthika Puranam Day6 Adhyayam

కార్తీకపురాణం – 6వ రోజు పారాయణము

దీపారాధన విధి, మహత్యం

తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు. ”ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో… వాడు అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఎవరైతే కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో… వారికి కైవల్యం ప్రాప్తిస్త్తుంది. దీంతోపాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలుగజేస్తుంది. దీపదానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి, శుభ్రపరిచి, వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి, వత్తులు అందులో వేసి, నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శక్తికొలది దక్షిణ సైతం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ… కార్తీక మాసం ఆఖరిరోజున వెండితో చేసిన ప్రమిదలో, బంగారంతో వత్తిని చేయించి, ఆవునెయ్యిపోసి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజూ ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో… వెండి ప్రమిదను సైతం చివరిరోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకలైశ్వర్యములు పొందడమే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని పొందగలరు” అని వివరించారు. దీపారాదన సమయంలో కింది స్త్రోత్రాన్ని పఠించాలి.

శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
   దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||

అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈ దీపారాదనము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!” అని పై శ్లోకానికి అర్థం. దీపదానం తంతు పూర్తయ్యాక బ్రాహ్మణ సమారాధన చేయాలి. అంత శక్తిలేనివారు కనీసం పదిమంది బ్రాహ్మణులను భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పురుషులుగాని, స్త్రీలుగాని ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు. ఇది సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగిన సుఖాలను అందజేస్తుంది. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది” అంటూ వశిష్టులవారు ఇలా చెబుతున్నారు.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట:
పూర్వ కాలమున ద్రావిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉంది. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. దీంతో ఆమె ఇల్లుల్లూ తిరిగి, పాచిపని చేస్తూ జీవనం గడపసాగింది. తాను పనిచేసే ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది. ఏమైనా మిగిలినా, ఎవరైనా వస్తువులిచ్చినా… దాన్ని ఇతరులకు విక్రయించి, సొమ్ము కూడబెట్టుకునేది. ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని వడ్డీలకు ఇస్తుండేది.

అయితే ఆమెకు దైవభక్తి అనేది లేదు. ఒక్కదినమైననూ ఉపవాసమున్న దాఖలాలు లేవు. దేవుడిని మనసారా ధ్యానించి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి, అవహేళన చేసేది. ఏనాడు బిక్షగాడికి పిడికెడు బియ్యం పెట్టక, తనూ తినక ధనాన్ని కూడబెట్టసాగింది.

అలా కొంతకాలం గడిచింది. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడొక సత్రంలో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామ మంచిచెడులు తెలుసుకుంటూ… ఆ స్త్రీని గురించి తెలుసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి ”అమ్మా… నా మాటలు విను. నీకు కోపం వచ్చినా సరే. నేను చెబుతున్న మాటల్ని ఆలకించు. మన శరీరాలు శాశ్వతాలు కాదు. నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా పుటుక్కుమనొచ్చు. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మితమైన ఈ శరీరంలో ప్రాణం, జీవం పోగానే చర్మం, మాంసం కుళ్లిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది. అలాంటి శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. బాగా ఆలోచించు. అగ్నిని చూసిన మిడత అది తినే వస్తువు అనుకుని, ఉత్సాహంగా వెళ్తుంది. కానీ, దగ్గరకు వెళ్లే వరకు తెలియదు. అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఆ మిడత బూడిదవుతుంది. మనుషులు కూడా అలాగే ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారంలోపడి నశిస్తున్నారు. కాబట్టి నామాట విను. ఇప్పటికైనా నువ్వు సంపాదించినదాంట్లో కొంత దానధర్మాలు చేసి, పుణ్యాన్ని సంపాదించు. ప్రతిరోజూ శ్రీమన్నారాయుణుడిని స్మరించు. వ్రతాలు చేయి. మోక్షాన్ని పొందవచ్చు. నీ పాప పిరహారార్థంగా వచ్చే కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించు. రోజూ ఉదయాన్నే నిద్రలేచి, సాన్నమాచరించి, దాన ధర్మాలతో బ్రాహ్మణులను సంతుష్టపరుచు. నువ్వు ముక్తిని పొందగలవు” అని సూచించాడు.

ఆ బ్రాహ్మడు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్న ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకుని, దానధర్మాలను చేస్తూ… కార్తీక వ్రతం ఆచరించింది. ప్రతిరోజూ దీపారాధన చేయడంతోపాటు, యథాశక్తి దీపదానం చేసింది. దీంతో ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. ”కాబట్టి రాజా… కార్తీక మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. ప్రతి కార్యం మోక్షదాయకమే” అని జనకుడు తెలిపాడు.ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఆరవ అధ్యాయము

ఆరవ రోజు పారాయణము సమాప్తము.

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం